భావితరాలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేయడంలో పండుగలు కీలక పాత్ర జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు.
సంగారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పట్టణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పే బతుకమ్మ పండుగ పూలకు ప్రత్యేక స్థానం కల్పిస్తుందని, ప్రకృతిని ఆరాధిస్తూ సంప్రదాయాలను కాపాడుకునే గొప్ప పండుగగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి పండుగలను సామూహికంగా జరుపుకోవడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు అందుతాయని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు, మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి సంప్రదాయబద్ధంగా ఆడిపాడారు. పూలతో అలంకరించిన బతుకమ్మలతో ప్రాంగణమంతా పండుగ శోభ సంతరించుకుంది. సంప్రదాయబద్ధంగా పండుగను సామూహికంగా జరుపుకోవడంతో కలెక్టరేట్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో కలెక్టరేట్లోని వివిధ శాఖల మహిళా అధికారులు, ఉద్యోగులతో పాటు కలెక్టరేట్ సమీప కాలనీలకు చెందిన మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












