విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే పంచాయతీ కార్యదర్శులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) మల్లారెడ్డి హెచ్చరించారు. మండలంలోని మూడు గ్రామ పంచాయతీ కార్యాలయాలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ తీరును పరిశీలించారు.
తనిఖీల సమయంలో విధులకు గైర్హాజరైన పంచాయతీ కార్యదర్శుల తీరుపై డీపీఓ మల్లారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి, గ్రామ పంచాయతీలకు సంబంధించిన సేవలను సకాలంలో అందించాల్సిన బాధ్యతను విస్మరించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గైర్హాజరైన పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా, నిర్ణీత సమయాల్లో విధులకు హాజరై బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. ఇకనైనా పంచాయతీ కార్యదర్శులు తమ పనితీరును మార్చుకోవాలని, లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని డీపీవో మల్లారెడ్డి మరోసారి హెచ్చరించారు. ఈ తనిఖీలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని తెలిపారు.











