వెట్టిచాకిరీ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్వేచ్ఛారథం రాష్ట్రవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ప్రచార జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పాండు జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనం జిల్లాలో పర్యటిస్తూ వెట్టిచాకిరీ, కార్మికుల హక్కులు, ఫిర్యాదు విధానాలు, బాధితులకు అందుబాటులో ఉన్న రక్షణ, పునరావాస సేవలపై అవగాహన కల్పించనుంది.
ముఖ్యంగా వ్యవసాయం, ఇటుక బట్టీలు, ఆక్వాకల్చర్, గనులు, క్వారీలతో పాటు ఇతర అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ, వెట్టిచాకిరీని నిషేధిస్తూ చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ, అక్కడక్కడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. వెట్టిచాకిరీకి సంబంధించిన ఫిర్యాదులను సమగ్రంగా విచారించడం, బాధితులను గుర్తించి రక్షించడం, వారికి పునరావాసం కల్పించడం, అవసరమైన సహాయం అందించడం కోసం జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఉప కార్మిక కమిషనర్ ఎం.యాదయ్య అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. వెట్టి చాకిరీకి గురైన వ్యక్తులను గుర్తించడం, వారిని రక్షించడం, పునరావాసం కల్పించడం, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయడం ప్రభుత్వ అధికారుల బాధ్యత అని ప్రతిజ్ఞలో పేర్కొన్నారు. వెట్టిచాకిరీకి గురైన కార్మికులు, అనుమానిత ఘటనల గురించి సమాచారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా బాండెడ్ లేబర్ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 080-69434343ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నంబర్‌ను ప్రజలకు విస్తృతంగా చేరువ చేయడం ద్వారా బాధితులు సకాలంలో సహాయం పొందేలా చర్యలు తీసుకోనున్నారు.
అప్పులు, ముందస్తు చెల్లింపులు, బెదిరింపులు, బలవంతం, మోసం, వేతనాలు నిలిపివేయడం, పని నుంచి స్వేచ్ఛగా బయటకు వెళ్లనివ్వకపోవడం వంటి పరిస్థితులు వెట్టిచాకిరీకి దారితీయవచ్చని అధికారులు తెలిపారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వలస కార్మికులు, ఇతర అసంఘటిత రంగ కార్మికులు దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉన్నందున వారిలో అవగాహన పెంపొందించడం అవసరమని పేర్కొన్నారు. వెట్టిచాకిరీని గుర్తించడం, ఫిర్యాదు చేయడం, బాధితులకు అందుబాటులో ఉన్న రక్షణ, సహాయ సేవలపై సమాచార, విద్య, ప్రచార సామగ్రి ద్వారా అవగాహన కల్పించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో జిల్లా యంత్రాంగాల సమన్వయంతో ఈ ప్రచార కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ఉప కార్మిక కమిషనర్ ఎం. యాదయ్య, సహాయ కార్మిక కమిషనర్ డి. సహితి, పటాన్చెరు సహాయ కార్మిక అధికారి ఎస్.ప్రవీణ్, జహీరాబాద్ సహాయ కార్మిక అధికారి ఆయేషా అఖీల్, డీఎస్పీ సత్తయ్య, పోలీసు శాఖ అధికారులు, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (ఏహెచ్‌టీయూ) బృందం, బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రతినిధులు, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (ఐజేఎం) ప్రతినిధులు, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.












