బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, సత్వర న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కల్పించాలని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఆయన, పలు కీలక సూచనలు చేశారు.
మంచిర్యాల జోన్ పరిధిలోని సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన డీసీపీ ఏ. భాస్కర్, స్టేషన్ పరిసరాలను పరిశీలించి, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ నిర్వహణ రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలను నిశితంగా పరిశీలించారు. పోలీస్ సిబ్బంది సమస్యలను కూడా ఆలకించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు ముమ్మరం చేసి విజిబుల్ పోలీసింగ్ చేపట్టాలని, ప్రతి కానిస్టేబుల్ తమ పరిధిలోని ప్రజలు, యువతతో మాట్లాడి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు.
సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించాలని, సైబర్ నేరాలపై అప్రమత్తం చేయాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని డీసీపీ సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచాలని తెలిపారు.
కళాశాలలు, పాఠశాలల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో మంచిర్యాల రూరల్ సీఐ రవీందర్, ఎస్ఐ ప్రశాంత్ పాల్గొన్నారు.












