జనగణనలో భాగంగా చేపట్టనున్న ఇండ్ల గణన ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని జనగణన తెలంగాణ రాష్ట్ర సంచాలకులు భారతి హోళ్ళికేరి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె ఈ ఆదేశాలు జారీ చేశారు.
జనగణన కార్యక్రమంలో భాగంగా మే 11వ తేదీ నుంచి ఇండ్ల గణన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, ప్రక్రియ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై రాష్ట్ర సంచాలకులు జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమీక్షించారు. ఇండ్ల జాబితా బ్లాక్‌ల రూపకల్పన, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం, శిక్షణ కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు.
ఈ గణన ప్రక్రియ ద్వారా అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో కీలక సమాచారం లభిస్తుందని హోళ్ళికేరి తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి, ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలని ఆమె కోరారు.
హైదరాబాద్ కేంద్రంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో కూడా నిబంధనల ప్రకారం, అధికారుల సమన్వయంతో ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపడతామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.
నియమించబడిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు త్వరలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ గణన ద్వారా లభించే సమాచారం సంక్షేమ పథకాల అమలుకు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.








