మంచిర్యాల నియోజకవర్గంలోని రాజీవ్ నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. రాబోయే మూడు నెలల్లో అర్హులైన లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ఇళ్లు కేటాయిస్తామని ఆయన తెలిపారు.
మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని 01వ డివిజన్ రాజీవ్ నగర్ లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల అధికారులతో నిర్వహించిన సమావేశంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమస్యలను ప్రస్తావించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు కనీస సౌకర్యాలు లేవని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
మంత్రి సానుకూలంగా స్పందించి, అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారని, దానిలో భాగంగానే ఈరోజు అధికారులతో కలిసి ఇళ్లను పరిశీలించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇంకొక మూడు నెలల వ్యవధిలో అర్హులైన లబ్ధిదారులందరికీ లాటరీ పద్ధతిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందజేస్తామని ఆయన వెల్లడించారు.
లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకునే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే హెచ్చరించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో పారదర్శకత కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.












