తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (ఎస్ఈఈఈపీసీఎస్)లో డేటా ఎంట్రీ పనులు పూర్తి చేసిన ఆపరేటర్లకు నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. రాత్రింబవళ్లు కష్టపడి సర్వే వివరాలను ఆన్లైన్లో నమోదు చేసిన ఆపరేటర్లు తమ చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నారు.
రాష్ట్ర ఆర్థిక, గణాంకాల డైరెక్టరేట్ 2025-26 బడ్జెట్ కింద అదనపు నిధులను విడుదల చేస్తూ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం. ఆ నిధులను నేరుగా డేటా ఎంట్రీ ఆపరేటర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని లేదా మండల, మున్సిపల్ అధికారుల ద్వారా పంపిణీ చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, జిల్లాల స్థాయిలో చెల్లింపుల ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత ఏడాది నుంచి కొనసాగిన ఈ సర్వేలో కోట్లాది కుటుంబాల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేయడంలో వందలాది మంది ఆపరేటర్లు పనిచేశారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైనట్లు తెలిసినా, జిల్లా స్థాయిలో ముఖ్య ప్రణాళికా అధికారులు (సీపీఓలు), జిల్లా కలెక్టర్ల వద్ద చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోయిందని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పలు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువకులు సొంత ఖర్చులతో పని పూర్తి చేసినప్పటికీ, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందలేదని చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో నిధులు ఇతర అవసరాలకు మళ్లించారా? లేక సాంకేతిక కారణాలతో ప్రక్రియ నిలిచిపోయిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిధులు ఉన్నప్పటికీ చెల్లింపుల్లో జాప్యం ఎందుకు జరుగుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.












