సింగరేణి సంస్థ అభివృద్ధికి కార్మికులు, అధికారులు సమిష్టిగా బాధ్యతగా పనిచేయాలని కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి సూచించారు. సింగరేణి కార్మికులతో తన కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కోల్ బ్లాక్ టెండర్లలో సింగరేణి సంస్థ పాల్గొనేలా చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. సింగరేణి సంస్థకు రూ.400 కోట్ల నిధులు ఇప్పించి, లక్ష ఉద్యోగాలను కాపాడిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని ఆయన గుర్తుచేశారు.
కొత్త గనులు ప్రారంభమైతే కొత్త ఉద్యోగాలు వస్తాయని, ఆర్కేపీ ఓపెన్‌కాస్ట్ ఫేజ్-2 ద్వారా సుమారు 5 వేల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి వెల్లడించారు. ఫారెస్ట్ అనుమతులు అందిన వెంటనే గనిని ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.
ప్రేక్స్పై ఇన్కమ్ ట్యాక్స్ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు. రిటైర్డ్ కార్మికులకు రూ.10 వేల పెన్షన్ వచ్చేలా ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్లో కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల పెంపు అంశాన్ని ముఖ్యమంత్రి అధ్యక్షతన త్వరలో పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ, కార్మిక సంఘాల నాయకులు, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.








