రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం రైతుల సమస్యలను వాడుకుంటోందని విమర్శించారు.
జైపూర్ మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు విశ్వంభర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి గొనె నర్సయ్య మాట్లాడారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు రాజకీయ లబ్ధి కోసమే రైతుల సమస్యలను వాడుకుంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ నాయకుల ధర్నాలు, రాస్తారోకోలు ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకేనని విమర్శించారు. రైతుల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంతో కలిసి పరిష్కార మార్గాలపై పనిచేయాలని సూచించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోందని, ధాన్యం కొనుగోలు, తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోళ్లలో అవినీతి, కమీషన్లు, లారీల కొరత వంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో లారీలను అందుబాటులో ఉంచి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నారని తెలిపారు. రైతుల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి నిబద్ధత ఉందని, బీఆర్ఎస్ నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు.












