తెలంగాణలో అక్రిడిటేషన్ల (Accreditation) పంపిణీలో దళిత, గిరిజన జర్నలిస్టులపై వివక్ష చూపుతూ అన్యాయం జరుగుతోందని తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంటోల్ల వెంకటస్వామి ఆరోపించారు. ఈ నెల 29న హైదరాబాద్లోని ఐ అండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా కమిటీ సమీక్ష సమావేశంలో వెంకటస్వామి మాట్లాడుతూ, అక్రిడిటేషన్ కమిటీలలో ఇతర సామాజిక వర్గాల ఆధిపత్యం కొనసాగిస్తూ దళిత, గిరిజన జర్నలిస్టులను పక్కన పెట్టే విధానాన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులకు వెంటనే అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆయన కోరారు.
రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వరకు దళిత, గిరిజన జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. దళిత, గిరిజన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కమిటీలలో స్థానం కల్పించినప్పుడే వారికి న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
దళిత, గిరిజన జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించే సంక్షేమ పథకాలలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి పిల్లల విద్యా ఖర్చుల కోసం నూరు శాతం రాయితీ ప్రకటించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 29న హైదరాబాద్లోని ఐ అండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ ముట్టడి కార్యక్రమాన్ని దళిత, గిరిజన జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అసోసియేషన్ జిల్లా నాయకులు కొండ రవి, దాస మల్లభాస్కర్, వాగుమారే కపిల్, కడుగొల్ల లచ్చిరాం, కరెండే గంగాధర్, న్యాయవాదులు ఆర్. రత్నం రావ్, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.











