రెవెన్యూ ఉద్యోగులు సక్రమంగా, బాధ్యతాయుతంగా పనిచేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, హౌసింగ్ శాఖల పనితీరుపై మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామిలతో కలిసి ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం రీ సర్వే చేపట్టిందని మంత్రి తెలిపారు. భూ సర్వే నిర్వహణకు సంబంధించి పలువురు తహసీల్దార్లు, సర్వేయర్లతో ముఖాముఖి నిర్వహించి, సర్వే కోసం కేటాయించిన గ్రామాలు, పూర్తయిన సర్వేలు, రోజువారీ సర్వే విస్తీర్ణం, సమయం వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సర్వే సమయంలో రైతులకు తమ భూమి విస్తీర్ణం, సరిహద్దుల వివరాలను స్పష్టంగా తెలియజేయాలని, ఎలాంటి సందేహాలు లేకుండా వివరించాలని తహసీల్దార్లు, సర్వేయర్లకు సూచించారు. తహసీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు రెవెన్యూ అధికారులు సర్వే ప్రక్రియను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, క్షేత్రస్థాయిలో పురోగతిని పరిశీలిస్తూ రైతుల సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకోవాలని ఆదేశించారు.
భూ సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. ఏడాదిన్నరలోపు వ్యవసాయ భూములతో పాటు ఆబాదీ ఆస్తుల రీ సర్వేను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే కొనసాగుతోందని, ఈ గ్రామాల్లో కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని సూచించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారమయ్యే వరకు విడతలవారీగా ఇళ్ల మంజూరు కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై నిర్మాణ వ్యయ భారాన్ని తగ్గించేందుకు సిమెంట్ బ్యాగ్‌ను కేవలం రూ.230కే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.












