ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్2026) ప్రక్రియలో భాగంగా, ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన ఓటర్లకు తమ పేర్లను తుది జాబితాలో చేర్చుకునేందుకు భారత ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు.
గైర్హాజరు, నివాస మార్పు, మరణం, నకిలీ ఓటరు (ఏఎస్ డీడీ) కేటగిరీల కింద గుర్తించబడటం వల్ల ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు చోటు చేసుకోని అర్హులైన ఓటర్లకు ఈ అవకాశం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ఆయన సమీక్షించి, పలు సూచనలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్, సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు అందక, చిరునామా మార్పు, మరణం, డూప్లికేట్ (ఏఎస్ డీడీ) కేటగిరీ కింద నమోదై, ముసాయిదా జాబితాలో పేర్లు లేని ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలకు ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశించారు.
సంబంధిత బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ద్వారా అటువంటి ఓటర్లను సంప్రదించి ఫారాలు అందేలా చూడాలని, వీలైనచోట భౌతికంగా అందించడంతో పాటు వాట్సాప్, ఈ-మెయిల్, ఎస్ఎంఎస్, తదితర మార్గాల ద్వారా కూడా పంపిణీ చేయాలని సూచించారు. ఓటర్లు తమ పాత ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్) నంబర్ ఆధారంగా ఎన్నికల సంఘం వెబ్సైట్ లేదా ఈసీఐనెట్ యాప్ ద్వారా కూడా ఫారాలను పొందవచ్చని తెలిపారు. ఇందుకోసం ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బూత్ స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, కాలనీల అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఓటర్లకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఓటరుకు ఓటరు జాబితాలో చోటు కల్పించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సి.సుదర్శన్ రెడ్డి సూచించారు.












