జైపూర్ మండల పరిధిలోని గ్రామ పంచాయతీలలో శుక్రవారం ఎంపీడీఓ శ్రీపతి బాపూరావు ఆధ్వర్యంలో అధికారుల బృందం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించింది. అభివృద్ధి పనులు, నిధుల వినియోగం, పారిశుధ్యం, ప్రజా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఎంపీడీఓ శ్రీపతి బాపూరావు వేలాల, పౌనూర్, శివ్వారం గ్రామాల్లో పర్యటించి, జరుగుతున్న అభివృద్ధి పనులను, పంచాయతీ రికార్డులను పరిశీలించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, నిధులను నిర్దేశించిన పనులకే వాడాలని, రికార్డులను పక్కాగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూడాలని, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు. హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత పంచాయతీదేనని, కొత్త మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
వేసవి దృష్ట్యా తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని, వీధి దీపాలు పనిచేయకపోతే వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో చలివేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించాలని కార్యదర్శులను ఆదేశించారు.
గ్రామ పంచాయతీ సిబ్బంది నిబద్ధతతో పనిచేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంపీడీఓ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.











