రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు సంగారెడ్డిలోని ఐబీ చౌరస్తా వద్ద యూరో కిడ్స్ పాఠశాల విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్, ట్రాఫిక్, పోలీస్ శాఖల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.
ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటిస్తూ రోడ్డు భద్రతకు సహకరించాలని అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు వాహనదారులకు పూలు అందిస్తూ, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమం వాహనదారులను ఆకట్టుకుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించడంతో పాటు విలువైన ప్రాణాలను కాపాడవచ్చని అధికారులు తెలిపారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై మరింత అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి, టౌన్ సీఐ రామనాయుడు, యూరో కిడ్స్ పాఠశాల ప్రిన్సిపాల్ అర్చన, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ సాజిద్, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.






