నవంబరు 15 నుండి 18 వరకు నల్లగొండలో జరిగే అఖిల భారత కిసాన్ సభ 36వ రైతు మహాసభలను జయప్రదం చేయాలని రైతు జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి జయరాజు పిలుపు నిచ్చారు. ఆదివారం సంగారెడ్డిలో సుందరయ్య భవన్ లో తెలంగాణ రైతు సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతు మహాసభల కరపత్రం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జయరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో దేశంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న భూమి, నీళ్లు, విత్తనాలు, ఎరువులు, మద్దతు ధరల సమస్యలపై చర్చించడం కోసం ఈనెల 15వ తేదీ నుండి 18వ తేదీ వరకు నల్లగొండ పట్టణంలో అఖిల భారత కిసాన్ సభ 36వ రైతు మహాసభలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభలకు దేశ వ్యాప్తంగా వెయ్యి మందిపైగా ప్రతినిధులు హాజరవుతున్నారని అన్నారు. 15వ తేదీన లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రైతులకు పండించిన పంటకు కనీసం మద్దతు ధర ప్రకటించడం లేదని, ఎరువులు, విత్తనాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని, విద్యుత్ ప్రైవేటీకరణ చేస్తున్నారని, కరువుతో నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వాలు చొరవ తీసుకోవడం లేదని ఆయన అన్నారు. రైతు సంక్షేమం కోసం జరిగే ఈ అఖిలభారత మహాసభలలో రైతులు, ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు జిల్లా కార్యదర్శి యస్.రమేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు కె.రాజయ్య, నాయకులు రాములు, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.












