నేషనల్ హైవే 63 ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ ప్రక్రియలో అవార్డు జారీ చేసే ముందు గ్రామసభలు నిర్వహించలేదని, రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ కర్ణమామిడి గ్రామ రైతులు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అవార్డు జారీ ప్రక్రియను పునః పరిశీలించాలని, నోటీసులను, అవార్డును రద్దు చేయాలని వారు కోరారు.
ఈ సందర్భంగా బీజేపీ తులా మధుసూదన్ రావు మాట్లాడుతూ, భూసేకరణ అధికారి గ్రామసభలు నిర్వహించకుండా, చట్టవ్యతిరేకంగా రైతులను మోసం చేసి అవార్డు జారీ చేశారని, మీ భూమికి ఇంత వెల కట్టాము, సంబంధిత డాక్యుమెంట్లు ఇస్తే మీ ఖాతాలో డబ్బులు వేస్తాం అని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. గతంలో కార్యాలయానికి వచ్చిన అమాయక రైతులను మభ్యపెట్టి, మీకు నోటీసులు ఇచ్చాము, మాకు సంతకాలు పెట్టండి అని చెప్పి కొద్దిమంది రైతుల వద్ద సంతకాలు సేకరించి, అవే గ్రామసభలుగా, రైతులందరూ అంగీకరించినట్లుగా నేషనల్ హైవే అథారిటీ అధికారులను మోసం చేసి అవార్డు పాస్ చేయించారని, ఇది పచ్చి మోసమని, భూసేకరణ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఆర్డీఓను గ్రామసభలు నిర్వహించకుండా అవార్డు ఎలా పాస్ చేశావు అని ప్రశ్నించగా, ఆర్డీఓ ఫోన్లో మాట్లాడుతూ, బాధిత రైతులందరూ కార్యాలయానికి వచ్చి 60 మంది సంతకాలు పెట్టారు అని తెలిపారు. ఒక జిల్లా కలెక్టర్‌నే తప్పుదోవ పట్టించడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. గతంలో పనిచేసిన ఆర్డీఓలు కూడా రైతులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు రికార్డు చేశారని, వారు అమాయకంగా కార్యాలయానికి వచ్చినప్పుడు సేకరించిన సంతకాలనే అవార్డుకు అంగీకారంగా చూపడం ప్రభుత్వానికి, రైతులకు ద్రోహం చేయడమేనని ఆయన అన్నారు. కాబట్టి, చట్టవిరుద్ధంగా, రైతులకు తెలియకుండా, గ్రామసభలు నిర్వహించకుండా అవార్డు పాస్ చేసిన ప్రక్రియపై విచారణ జరిపి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, వెంటనే అవార్డును రద్దు చేసి, నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులందరూ మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఎంపీ వంశీ, మంత్రి వివేక్ వంటి కూడా రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగిస్తుందని చెప్పి, ఇప్పుడు ప్రజలను వంచించే విధంగా, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మంచిర్యాల అధికారులు రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా పార్లమెంట్ సభ్యులు వంశీ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి, కొండలు ఎక్కడం, ట్రిక్కింగ్లు చేయడం మాని, ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్న రైతులకు అండగా నిలబడి, మా సమస్యకు పరిష్కారం వెతకాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ తులా మధుసూదన్ రావు, కస్తూరి మల్లేష్, మేడిపల్లి సత్యం, అనిల్, పరమేష్, దాస్య నాయక్, నైనాల తిరుపతి, సిహెచ్ జగన్, గోల్ల తిరుపతి, శ్రీను, గొల్ల స్వామి, అప్పని లింగయ్య, తదితర కర్ణమామిడి గ్రామ రైతులు పాల్గొన్నారు.

