ఆదివాసీల పోరాట యోధుడు కొమురం భీమ్ 86వ వర్ధంతి సందర్భంగా ఆదివాసి కోయ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పోస్ట్ మెట్రిక్ ఎస్టీ బాలుర వసతి గృహంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, ఆయన ఆశయాలను కొనసాగించాలని వక్తలు పిలుపునిచ్చారు.
ఆదివాసీల పోరాట యోధుడు కొమురం భీమ్ 86వ వర్ధంతి సందర్భంగా ఆదివాసి కోయ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పోస్ట్ మెట్రిక్ ఎస్టీ బాలుర వసతి గృహంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కొమురం భీమ్ చిత్రపటానికి కోయ సంఘం జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, గౌరవ అధ్యక్షులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నినాదాలు చేశారు. ఈ వర్ధంతిని పురస్కరించుకుని కోయ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు నైతం లక్ష్మణ్ మాట్లాడుతూ, నేడు ఆదివాసీలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారంటే అది జల్ జంగల్ జమిన్ కోసం పోరాడిన కొమురం భీమ్ పోరాట ఫలితమేనని అన్నారు. వర్ధంతి రోజున కేవలం కొమురం భీమ్‌ను ఆరాధించడమే కాకుండా, ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఆదివాసీలు ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోయ సంఘం జిల్లా అధ్యక్షులు చెడంక మాంతయ్య, ప్రధాన కార్యదర్శి మడె సమ్మయ్య, జాయింట్ కార్యదర్శులు అర్క రాజారామ్, తలండి సత్యం, మండల అధ్యక్షులు ఆత్రం సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి ఆలం బానేష్, ప్రచార కార్యదర్శి గావిడి సమ్మయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.












