జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించి, బాధితులకు ప్రభుత్వం అందించే పరిహారం సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగేలా రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్‌తో కలిసి పోలీసు, రెవెన్యూ, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి సంక్షేమ శాఖలతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులతో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీలు, ఇతర అణగారిన వర్గాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు త్వరితగతిన పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని, అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, ఎస్పీ పరితోష్ పంకజ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, రాంబాబు నాయక్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామేశ్వరి దేవి, జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.











