మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 26
ప్రపంచ ప్రఖ్యాత సంఘ సేవకురాలు, నోబుల్ శాంతి బహుమతి గ్రహీత సెంట్ మదర్ తెరిసా 116వ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాలలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదానం వంటి కార్యక్రమాలు చేపట్టారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ సంఘ సేవకురాలిగా పేరుగాంచిన, నోబుల్ శాంతి బహుమతి పురస్కార గ్రహీత సెంట్ మదర్ తెరిసా జన్మదినోత్సవం ఈరోజు. ఆమె ఆగస్టు 26, 1910న ఉత్తర మెసిడోనియాలోని స్కోప్జే నగరంలో జన్మించారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
వైద్య శిబిరం, రక్తదానం
రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులైన పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం, లయన్ వి. మధుసూదన్ రెడ్డి సహకారంతో, రక్తనిధి కేంద్రంలో వారి కార్యాలయ సిబ్బంది వినోద్, రాజు మరియు ఇతరులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
మదర్ తెరిసా సేవలు
ఈ సందర్భంగా లయన్ వి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, మదర్ తెరిసా విదేశాల్లో జన్మించినప్పటికీ, 1929లో భారతదేశానికి వచ్చి కలకత్తా నగరంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో తమ అమూల్యమైన సేవలను అందించారని తెలిపారు. ముఖ్యంగా అనాథలకు, కుష్టు రోగులకు, నిరాశ్రయులకు సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలని కొనియాడారు.
ప్రేరణాత్మక నినాదం
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే నినాదంతో విశ్వమాతగా పేరుగాంచిన సంఘ సేవకురాలు.
భారతరత్న పురస్కారం
సమాజానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదుతో సత్కరించింది. మనమందరం ఆమె సేవా మార్గంలో పయనించాలని విజ్ఞప్తి చేశారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ పి. వెంకటేశ్వర్లు, లయన్ వి. మధుసూదన్ రెడ్డి, లయన్ కె. భాస్కర్ రెడ్డి, లయన్ ఎస్. నాగేందర్, లయన్ . దామోదర్, రక్తనిధి సిబ్బంది మాధవి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.












