నిర్మల్, 8 July
జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ (NECC) వారి సహకారంతో, నిర్మల్ ఉమ్మడి మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు వి. సత్యనారాయణ గౌడ్ బుధవారం 20 మంది నిరుద్యోగులకు, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను, సిలిండర్, ఇతర సామాగ్రిని పంపిణీ చేశారు. వశిష్ట విద్యా సంస్థలు, అభిరామ్ ఫ్యూయల్స్ ఈ కార్యక్రమానికి సహకరించాయి.
జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ (National Egg Co-ordination Committee) వారి సౌజన్యంతో, నిర్మల్ పట్టణంలోని వశిష్ట విద్యా సంస్థలు మరియు అభిరామ్ ఫ్యూయల్స్ సహకారంతో సోన్ మండలం కడ్తాల్ అభిరామ్ పెట్రోల్ బంక్ ఆవరణలో బుధవారం 20 మంది నిరుద్యోగులకు, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను, సిలిండర్, ఇతర సామాగ్రిని నిర్మల్ ఉమ్మడి మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు వి. సత్యనారాయణ గౌడ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉచితంగా పంపిణీ చేసిన ఈ తోపుడు బండ్లను సద్వినియోగం చేసుకోవాలని, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలని సూచించారు. పోషకాహారాన్ని అందించే గుడ్డు యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లో ప్రచారం చేయాలని, సంస్థ అందిస్తున్న సహకారాన్ని వివరించాలని కోరారు.
భారతదేశంలోని పౌల్ట్రీ రైతులు నిరుద్యోగులకు సహాయం చేయడానికి స్థాపించిన జాతీయ గుడ్డు సమన్వయ కమిటీలో దేశవ్యాప్తంగా 35 వేల మంది సభ్యులు ఉన్నారని, ఇది పౌల్ట్రీ వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థ అని పేర్కొన్నారు. ఎన్ఈసీసీ (NECC) సంస్థ సామాజిక బాధ్యతగా నిరుద్యోగులకు ఈ రకమైన సహాయ సహకారాలు అందిస్తుందని, సంస్థ గొప్పతనాన్ని వివరించారు.
తోపుడు బండ్లు అందుకున్న లబ్ధిదారులు తమ జీవనోపాధికి ఉపయోగపడుతున్న సంస్థకు, వశిష్ట విద్యాసంస్థలకు, వి. సత్యనారాయణ గౌడ్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో మంజులాపూర్ వైస్ చైర్మన్ బర్మ గంగాదాసు, కొండాపూర్, రత్నాపూర్ కండ్లీ మాజీ సర్పంచులు నవత్ గంగాధర్, ఫీచర్ శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, నాయకులు రమణ గౌడ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.












