జాతీయ రహదారులపై రాత్రి వేళల్లో వాహనాలను ఆపి, ప్రయాణికులను బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. సంగారెడ్డి జిల్లాలో మూడు, కర్ణాటకలో ఒకటి చొప్పున మొత్తం నాలుగు కేసులను పోలీసులు ఛేదించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కేసుల వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలో వరుస దారి దోపిడీ ఘటనలపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ, సీసీఎస్, జహీరాబాద్ సబ్ డివిజన్, సదాశివపేట పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల కదలికలను గుర్తించారు.
ఈ క్రమంలో చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాడ్గి చౌరస్తా వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, నంబర్ ప్లేట్ లేని నీలం రంగు యమహా ఆర్-15 ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా, సంగారెడ్డి జిల్లాలో జరిగిన మూడు దారి దోపిడీలతో పాటు కర్ణాటకలోని హుమ్నాబాద్‌లో జరిగిన మరో దోపిడీలో తమ ప్రమేయాన్ని అంగీకరించారు.
నేరాలకు పాల్పడిన తీరు
మహారాష్ట్రలోని లాతూర్, పూణే, బారామతి ప్రాంతాలకు చెందిన నిందితులు ముఠాగా ఏర్పడి జాతీయ రహదారులపై రాత్రివేళల్లో సంచరిస్తూ, అత్యవసర కారణాలతో రోడ్డు పక్కన కార్లు నిలిపిన వారిని లక్ష్యంగా చేసుకునేవారు. ముఖాలు గుర్తుపట్టకుండా మంకీ క్యాప్‌లు ధరించి, నకిలీ తుపాకీ, కత్తులతో ప్రయాణికులను బెదిరించి బంగారు ఆభరణాలు, నగదును దోచుకునేవారు. అనంతరం ద్విచక్ర వాహనంపై మహారాష్ట్రలోని లాతూర్కు చేరుకొని, దోచుకున్న బంగారు ఆభరణాలను అక్కడి బంగారు దుకాణంలో విక్రయించి డబ్బులు పంచుకునేవారు.
నిందితుల వివరాలు
అరెస్టయిన వారిలో హసన్ సమీర్ షేక్ (32), సంతోష్ సెగర్ ధగుడు (35), నౌషాద్ జాకీర్ సయ్యద్ (24) ఉన్నారు. వీరంతా మహారాష్ట్రకు చెందినవారు. మరో నిందితుడు రఫీక్ షంషోద్దీన్ షేక్ (28) పరారీలో ఉన్నాడు. అతడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ప్రధాన నిందితుడు హసన్ సమీర్ షేక్‌పై మహారాష్ట్రలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దోపిడీ, దొంగతనాలకు సంబంధించి గతంలో 12 కేసులు నమోదయ్యాయి. మరో నిందితుడు సంతోష్‌పై రెండు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఆయుధాలు, వాహనం స్వాధీనం
నిందితుల నుంచి నేరాలకు ఉపయోగించిన నంబర్ ప్లేట్ లేని నీలం రంగు యమహా ఆర్-15 ద్విచక్ర వాహనం, నకిలీ ఎయిర్ పిస్టల్, రెండు కత్తులు, రెండు నల్ల క్యాప్‌లు, మూడు స్వెట్టర్లు, ఒక బ్యాగు, రెండు ఆధార్ కార్డులు, మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దోచుకున్న బంగారు ఆభరణాలను లాతూర్‌లో విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది. వాటిని కొనుగోలు చేసిన వ్యక్తి, బంగారు దుకాణం వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.












