హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడి పేటలో ఒంటరిగా ఉన్న మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయిన కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ కేసు వివరాలను మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ వెల్లడించారు.
గుడిపేటకు చెందిన లగిశెట్టి దేవక్క ఇంటి ముందు ఉండగా, స్కూటీపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారు. రాకేష్ అనే వ్యక్తి ఇంటి అడ్రస్ గురించి అడిగినట్లు ఏసీపీ తెలిపారు. అనంతరం ఆమె ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకొని, గొంతు పట్టుకొని అరిస్తే చంపుతాం అని బెదిరించి మెడలోని బంగారు గొలుసును లాక్కున్నారు.
నిందితులు బాధితురాలిని కింద పడేసి స్కూటీపై పారిపోయారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు హాజీపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుల్లో బెల్లంపల్లి మండలం దుగినేపల్లికి చెందిన డోలే చంద్రకాంత్, కుమురంభీం జిల్లా వాంకిడి మండలం ఇందానికి చెందిన చాకటి అనిల్ కుమార్లను అరెస్టు చేశారు.
ములుగు జిల్లా వెంకటాపురానికి చెందిన ముత్యబోయిన ప్రేంచంద్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన మంచిర్యాల గ్రామీణ సీఐ రవీందర్, హాజీపూర్ ఎస్సై కిరణ్ కుమార్, నస్పూర్-2 ఎస్సై జితేందర్ సింగ్, ఏఎస్సై ఇజాజ్, కానిస్టేబుళ్లు నరేందర్, చంద్రశేఖర్, జనార్ధన్, వెంకట సాయి, ఇతర సిబ్బందిని ఏసీపీ ప్రకాష్ అభినందించారు.












