మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు చాకచక్యంగా భగ్నం చేశారు. భీమారం, చెన్నూర్ మండలాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి, సుమారు 386 కేజీల నిషేధిత HT...BT3 పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
జైపూర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ఏ.భాస్కర్ IPS ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఐదుగురు సభ్యులున్న ఈ ముఠా ఆంధ్ర ప్రాంతం నుండి నిషేధిత HT..BT3 రకం నకిలీ పత్తి విత్తనాలను తెప్పించి, మంచిర్యాల జిల్లాలోని భీమారం, చెన్నూర్ మండలాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి, 386 కేజీల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని డీసీపీ పేర్కొన్నారు. నకిలీ HT..BT3 విత్తనాల వాడకం వల్ల భూసారం తగ్గిపోయి, పంట నష్టంతో పాటు పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని ఆయన హెచ్చరించారు. రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని, ప్రభుత్వ లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు.
నకిలీ విత్తనాల విక్రయంపై తెలంగాణ ప్రభుత్వం, పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని డీసీపీ స్పష్టం చేశారు. నిందితులపై పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తామని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులను డీసీపీ అభినందించారు.










