సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు డా.పోట్రు రామకృష్ణకు జాతీయ స్థాయిలో రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయనకు ఈ గౌరవాలు దక్కాయి.
గాంధీ జయంతిని పురస్కరించుకొని, నీతి ఆయోగ్ గుర్తింపు పొందిన మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో, మనం ఫౌండేషన్ జాతీయ చైర్మన్ డాక్టర్ కె.చక్రవర్తి అధ్యక్షతన శనివారం జరిగిన జాతీయ స్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో డా. రామకృష్ణకు ఇంటర్నేషనల్ మనం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ - 2026 లో అవుట్ స్టాండింగ్ ఎడ్యుకేషనల్, ఎన్విరాన్మెంటల్ అండ్ హ్యూమనిటేరియన్ సర్వీస్ లీడర్షిప్ అనే రికార్డ్ టైటిల్ పురస్కారం, జాతీయ స్థాయి స్వచ్ఛ హరిత విద్యారత్న పురస్కారం - 2026 అనే రెండు పురస్కారాలను ముఖ్య అతిథులు రిటైర్డ్ డీఎస్ పీ జి.సుబ్బారావు, రచయిత యలమంచిలి వెంకటరమణ, ఎస్ బీఐ మాజీ మేనేజర్ డాక్టర్ కే. రాజ్యలక్ష్మి, పారిశ్రామికవేత్త సుబ్బరాజు చేతుల మీదుగా ప్రదానం చేశారు. గత 28 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా అందిస్తున్న విశిష్ట సేవలు, విద్యారంగ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, రక్తదానం, మానవతా సేవ, సైనిక్ ఫండ్ విరాళాల సేకరణ వంటి పలు రంగాలలో ఆయన చేసిన కృషిని గుర్తించి ఈ పురస్కారాలు అందించారు. డా. రామకృష్ణ ఇప్పటివరకు 40కి పైగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులతో పాటు రెండు డాక్టరేట్లు అందుకున్నారు. ఆయన సేవలను గుర్తించి ఈ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డా.సి.హెచ్. త్రినాథరావు, గోల్డ్ మెడలిస్ట్ డా.పి.వసంత రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. అవార్డులు అందుకున్న డా. రామకృష్ణను జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, మండల విద్యాధికారి శంకర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాజశ్రీ, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.












