మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌ను జాయింట్ కలెక్టర్ చంద్రయ్య ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి, విద్యా విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను కూడా ఆయన పరిశీలించారు.
మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలో జాయింట్ కలెక్టర్ చంద్రయ్య, ఎంపీడీవో వీణా, సర్పంచ్ ఉష్కమల్ల విజయలక్ష్మి, పున్నం చందు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించి, పాఠశాల విద్యా విధానం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా, పక్కనే మానసిక వికలాంగుల కోసం నిర్మిస్తున్న భవిత కేంద్రాన్ని సందర్శించారు. ఇది అతి త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో, అక్కడి పనులను పరిశీలించారు. పక్కనే ఉన్న ఎంపీపీఎస్ స్కూల్‌ను సందర్శించి, బోర్వెల్ చుట్టూ నిర్మిస్తున్న ఇంకుడు గుంత (బోర్వెల్ రీఛార్జ్)ను పరిశీలించారు. ఐటీడీఏ కాలనీలో రైతు సెగ్యం రమాదేవి పొలంలో తవ్వుతున్న ఊట కుంట (ఫార్మ్ ఫౌండ్)ను పరిశీలించారు.
ఆశ్రమ పాఠశాలను సందర్శించి, అక్కడ నిర్మిస్తున్న టాయిలెట్, వాష్‌రూమ్‌లను పరిశీలించారు. జడ్పీహెచ్ఎస్ స్కూల్‌కు కొంత నిధులు మంజూరు చేయాలని, పాఠశాల బాల్కనీలు కృంగిపోయినందున మరమ్మతుల కోసం నిధులు కేటాయించాలని సర్పంచ్ జాయింట్ కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, ఏపీఎం జీనత్, ఎంపీఓ సతీష్ రెడ్డి, సెక్రటరీ మల్లేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.











