Mancherial/Kotapalli (అక్షరవేకువ) జూలై 08
కోటపల్లి మండలంలోని కేజీబీవీ హాస్టల్ నుండి తప్పిపోయిన ఇంటర్ విద్యార్థినిని కోటపల్లి పోలీసులు కరీంనగర్లో గుర్తించి, సురక్షితంగా తల్లి వద్దకు చేర్చారు. బాలికకు హాస్టల్లో ఉండడం ఇష్టం లేకపోవడంతో ఈ నెల 5వ తేదీన వెళ్లిపోయింది.
కోటపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ హాస్టల్ నుండి తప్పిపోయిన ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థినిని కోటపల్లి పోలీసులు కరీంనగర్లో గుర్తించారు. బాలికను సురక్షితంగా తల్లి వద్దకు చేర్పించారు.
కేజీబీవీ కోటపల్లిలో చదువుతున్న ఒక బాలిక, హాస్టల్లో ఉండడం ఇష్టం లేదని తరచూ తోటి విద్యార్థులతో, తల్లితో చెబుతుండేది. తల్లి నచ్చజెప్పి హాస్టల్లోనే ఉండి చదువుకోవాలని సూచించినప్పటికీ, బాలికకు హాస్టల్లో ఉండాలనే ఆసక్తి లేకపోవడంతో, 2026 జూలై 05వ తేదీ ఉదయం ఎవరికీ చెప్పకుండా హాస్టల్ నుండి వెళ్లిపోయింది.
బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోటపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, కోటపల్లి ఎస్సై రాజశేఖర్ దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, చెన్నూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల చాకచక్యమైన దర్యాప్తు, సమన్వయంతో కూడిన గాలింపు చర్యల ఫలితంగా, కరీంనగర్ బస్ స్టాండ్ పరిసర ప్రాంతంలో బాలికను సురక్షితంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలికను రక్షణలోకి తీసుకుని, అవసరమైన న్యాయపరమైన ప్రక్రియలు పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు.
ఈ కేసు దర్యాప్తులో చురుకుగా, సమర్థవంతంగా పనిచేసిన చెన్నూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్, కోటపల్లి ఎస్సై రాజశేఖర్, నిల్వాయి ఎస్సై జగదీష్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ బుజ్జిబాబు, కానిస్టేబుళ్లు శ్యామ్ సుందర్, శ్రీనివాస్, శ్రావణ్, సమ్మయ్య, నరేష్‌లను జైపూర్ ఏసీపీ అభినందించారు.












