ఉపాధి కోసం తెలంగాణకు వచ్చి గంజాయి బానిసగా మారిన ఓ వలస కూలీ జీవితం పోలీసుల చొరవతో తిరిగి సంతోషంగా మారింది. మంచిర్యాల జిల్లా భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో, ఎస్ఐ రాజేందర్ చొరవతో ఆ వ్యక్తి డీ-అడిక్షన్ చికిత్స పొంది, వ్యసనం నుంచి బయటపడ్డాడు.
బీహార్ రాష్ట్రానికి చెందిన ఈ వలస కూలీ, మంచిర్యాల జిల్లా భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. కొంతకాలంగా గంజాయికి బానిసై కుటుంబానికి దూరమవుతున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన భీమారం ఎస్ఐ రాజేందర్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతనికి సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. సదరు వ్యక్తిని మంచిర్యాల జోన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించి, నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందేలా చూశారు. చికిత్స అనంతరం గంజాయి అలవాటును పూర్తిగా మానేసి, ప్రస్తుతం తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాడు.
తన జీవితంలో వచ్చిన ఈ సానుకూల మార్పుకు పోలీసుల సహకారమే కారణమని పేర్కొంటూ, ఆ వ్యక్తి భీమారం పోలీస్ స్టేషన్‌కు స్వయంగా వచ్చి ఎస్ఐ రాజేందర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. గంజాయి అలవాటును మానుకోవడం వల్ల తన కుటుంబ జీవితం తిరిగి సంతోషంగా మారిందని తెలిపాడు. పోలీసుల సహాయానికి గుర్తుగా స్వీట్లు తీసుకువచ్చి ఎస్ఐకి అందజేశాడు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేందర్ మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు బానిసైన వారిని నేరస్తులుగా మాత్రమే చూడకుండా, వారి జీవితాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి అవసరమైన సహాయం అందించడం కూడా పోలీసుల సామాజిక బాధ్యతలో భాగమని అన్నారు. మత్తు పదార్థాల బారిన పడిన యువత, ఇతర వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డీ-అడిక్షన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, కుటుంబంతో ఆనందంగా జీవించాలని, అవసరమైన వారికి పోలీసుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎస్ఐ రాజేందర్ తెలిపారు.












