జిల్లా జహీరాబాద్ బస్టాండ్‌లో తల్లులు తమ శిశువులకు ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణంలో తల్లిపాలు అందించేందుకు బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్‌ను జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి, మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ యునస్ ప్రారంభించారు. అనంతరం రచ్చన్నపేటలో పోషణ్ మాహ్ కార్యక్రమం నిర్వహించారు.
జహీరాబాద్ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన ఈ క్యాబిన్‌ను జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి, మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ యునస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శిశువులకు తల్లిపాలు అందించడం వల్ల కలిగే ప్రయోజనాలు, శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలలో తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. అనంతరం రచ్చన్నపేటలోని గౌరీ ప్యాలెస్‌లో పోషణ్ మాహ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి ముఖ్య అతిథిగా హాజరై పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సమతుల్యమైన పోషకాహారం అందించడం అత్యంత కీలకమని ఆమె తెలిపారు.
ముఖ్యంగా శిశువు జీవితంలోని మొదటి 1,000 రోజులు ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది వేస్తాయని, ఈ కాలంలో తల్లికి, బిడ్డకు సరైన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ అందించాల్సిన అవసరం ఉందని వివరించారు. స్థానికంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, చిరుధాన్యాలు, ఇతర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ సుశీల, జహీరాబాద్ తహసీల్దార్ దశరథ్, జిల్లా కోఆర్డినేటర్ పల్లవి, జహీరాబాద్ సెక్టార్ సూపర్వైజర్లు, ఐసీడీఎస్ సిబ్బంది, బ్లాక్ కోఆర్డినేటర్, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.











