మంచిర్యాల్ లోని మాత శిశు సంరక్షణ కేంద్రం మరియు తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్శనలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్, ఆర్ ఎం ఓ డాక్టర్ శ్రీధర్, స్పెషలిస్టు వైద్యులు మరియు జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు. డాక్టర్ నరేందర్ రాథోడ్, మాత శిశు సంరక్షణ కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు.
ఈ కేంద్రంలో హెల్ప్ డెస్క్ ద్వారా దూర ప్రాంతాల నుండి వచ్చే రోగులకు అవసరమైన సహాయం అందించబడుతుందని తెలిపారు. గర్భవతులు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
మాత శిశు సంరక్షణ కేంద్రంలో మే నెలలో 342 సాధారణ ప్రసవాలు, 137 సిజేరియన్లు మరియు 20 ఇతర ప్రసవాలు నమోదయ్యాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు మాత శిశు సంరక్షణ కార్డులను నమోదు చేసి పంపాలని మరియు హైరిస్క్ గర్భవతుల వివరాలను హెల్ప్ డెస్క్ కు తెలియజేయాలని సూచించారు.
తెలంగాణ డయాగ్నస్టిక్స్ లో డెంగ్యూ నిర్ధారణ కోసం ఉపయోగించే ఎలిసా మిషన్ పరిశీలించి, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 72 రకాల పరీక్షలను ఉచితంగా అందించడానికి చర్యలు చేపట్టాలని అధికారులు తెలిపారు.












