మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నూతన అధికారిగా డాక్టర్ నరేందర్ రాథోడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను కలిసి పుష్పగుచ్చం అందించారు.
డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమీక్షించి, జిల్లాను ఆరోగ్య రంగంలో ముందుంచుతానని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వాతావరణ మార్పుల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని తెలిపారు.
వ్యాధుల నివారణకు ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల సహకారం తీసుకోవాలని, ప్రభుత్వ వైద్య సేవలు, 108 అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మాతాశిశు సంరక్షణ, టీకాల కార్యక్రమాలు, అసంక్రమిత వ్యాధుల నియంత్రణ వంటి జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.












