ప్రమాదాలు, అనారోగ్యాలు, గర్భిణీ స్త్రీల అవసరాలు, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి రక్తదానం ప్రాణాపాయ సంజీవనిగా ఉపయోగపడుతుంది. అత్యవసర సమయాల్లో రక్తం అవసరాన్ని గుర్తించి, దాని విశిష్టతను చాటి చెప్పేందుకు ప్రపంచవ్యాప్తంగా రక్తదాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ఫౌండర్ ఏబీవో బ్లడ్ సిస్టంను కనుగొని, నోబుల్ బహుమతి పొందిన కాల్ ల్యాండ్ స్టీనర్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్ 14న ప్రపంచ రక్తదాన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవం వెలుగులోకి రావడంతో, అనేక స్వచ్ఛంద సంస్థలు రక్త సేకరణ, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను జాగృతం చేస్తున్నాయి.
స్టీనర్ ఆదర్శాన్ని స్ఫూర్తిగా తీసుకొని, ప్రతి ఒక్కరూ రక్తదానం దిశగా కదిలితేనే ఆశించిన ఫలితాలు నెరవేరుతాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అన్ని దానాల్లో రక్తదానమే అత్యంత శ్రేష్ఠమైనదని పిలుపునిస్తున్నారు. ప్రమాద బాధితులు, క్షతగాత్రులు, గర్భిణీలు, తలసేమియాతో బాధపడేవారికి ప్రతి బొట్టు రక్తం అత్యవసరమని గుర్తించాలని సూచిస్తున్నారు.
రక్త సేకరణలో దాతల సామాజిక స్ఫూర్తి కీలకమని, మంచిర్యాల బ్లడ్ బ్యాంక్ వంటి సంస్థలు రక్తదాన అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంలో ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కూడా రక్త సేకరణలో అరుదైన ఘనత సాధిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు.












