మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 11
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. కుటుంబ సంక్షేమం, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 18వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అరుణ శ్రీ, డాక్టర్ సుధాకర్ నాయక్, ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ శ్రీధర్ ఈ ర్యాలీని ప్రారంభించారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జూలై 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు ప్రజలలో కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా 'పిల్లలకు మధ్య సరైన అంతరం ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా, నైపుణ్యంగా ఉంటుంది' అనే నినాదంతో అర్హులైన దంపతులకు అవగాహన కల్పిస్తోంది.
కుటుంబ నియంత్రణలో తాత్కాలిక పద్ధతులకు ప్రాధాన్యత ఇస్తూ, తల్లిబిడ్డలు ఆరోగ్యంగా ఉండటానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పరంగా స్త్రీలకు నోటి మాత్రలు, మాల ఛాయా, ఈజిపిల్స్, ఐయూసీడీ, అంతరా ఇంజక్షన్ వంటి తాత్కాలిక పద్ధతులు అందుబాటులో ఉన్నాయని, పురుషులకు వసెక్టమీ వంటి శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులను ప్రచారం చేసి వైద్య సేవలు అందించాలని తెలిపారు.
దేశ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో 'చిన్న కుటుంబం - చింతలేని కుటుంబం' అనే భావనతో తల్లిబిడ్డల ఆరోగ్యం, కుటుంబ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఆశ కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు గ్రామాలలో చిన్న సమావేశాలు ఏర్పాటు చేసి తాత్కాలిక పద్ధతుల గురించి తెలియజేయాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నోటీసు బోర్డులపై సమాచారం అతికించి ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్, మాస్ మీడియా బృందం సభ్యులు అల్లాడి శ్రీనివాస్, ఎండి రషీద్, సిహెచ్ వోలు, శ్రీ నాందేవ్, శ్రీ కాకిరాల వెంకటేశ్వర్లు, పుట్ట సత్తయ్య, ఆర్ఎస్ పద్మ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ సంచాలకులు, అధికారులు, నర్సింగ్ విద్యార్థులు, వైద్యులు, జిల్లా సబ్మిట్ అధికారి శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.











