మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 10
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా, జులై 11 నుండి 18 వరకు జరిగే వైద్య ఆరోగ్య కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలపై మంచిర్యాలలో పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ విడుదల చేశారు. కుటుంబ నియంత్రణ పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం మంచిర్యాలలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జులై 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరిగే వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై, అవగాహన కార్యక్రమాలపై పోస్టర్లను, కరపత్రికలను, బ్యానర్లను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ సంవత్సరము మంచిర్యాల జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల పరిధిలో వైద్యులు, ఆశ ఆరోగ్య కార్యకర్తలు ప్రజలలో కుటుంబ నియంత్రణ పద్ధతులపై, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కలిగించాలని సూచించారు. అదేవిధంగా, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తాత్కాలిక పద్ధతులుగా స్త్రీలకు నోటి మాత్రలు, అంతర ఇంజక్షన్, మాల ఛాయా, ఈజీ పిన్, ఐయుసిడి గురించి, అదేవిధంగా పురుషులకు నిరోధ్ గురించి అవగాహన కలిగిస్తూ డిస్ప్లే చేసి పెట్టాలని కోరారు.
అదేవిధంగా, శాశ్వత పద్ధతులుగా పురుషులకు వ్యాసెక్టమీ, స్త్రీలకు ట్యూబెక్టమీ చేయించాలని కోరారు. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం ద్వారా దంపతులు ఆనందకర దాంపత్యాన్ని ఆస్వాదించగలుగుతారని, తమ పిల్లలను బాధ్యతగల భావి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారని అన్నారు. అందువలన కుటుంబ సంక్షేమ కార్యక్రమాల్లో ఇది చాలా ముఖ్యమని తెలిపారు.
చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం, కావున పిల్లలకు సరైన అంతరం ఉంటే కుటుంబం ఆరోగ్యంగా, నైపుణ్యంతో ఉంటుందనే నినాదంతో అవగాహన కలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి ప్రజలలో అవగాహన కలిగించాలని, ప్రచారం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ అశోక్, డాక్టర్ తబియా, ప్రోగ్రాం ఆఫీసర్ ఎంసిహెచ్ డాక్టర్ అరుణ శ్రీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, డిపిహెచ్ఎన్ఆర్ఎస్ పద్మ, సిహెచ్వోలు కాకిరాల వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, నాందేవ్, ప్రవళిక, వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని అధికారులు పాల్గొన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపించడం జరిగినది. ఈ కార్యక్రమం రేపు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రారంభించుకోవడం జరుగుతుంది.











