పోషకాహార లోపాలు, రక్తహీనత, అధిక మద్యపానం మెదడులోని సిరల్లో రక్తం గడ్డకట్టే సమస్యకు (సెరెబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ సీవీటీ) సంబంధించిన ప్రమాద కారకాలుగా ఉండవచ్చని బెంగళూరులోని నిమ్హాన్స్ పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా ప్రోటీన్, ఫోలేట్, విటమిన్ బి12 లోపాలు, రక్తంలో హోమోసిస్టీన్ స్థాయులు పెరగడం ఈ వ్యాధితో సంబంధం కలిగి ఉన్నట్లు అధ్యయనంలో గుర్తించారు.
పోషకాహార లోపాలు, రక్తహీనత, అధిక మద్యపానం మెదడులోని సిరల్లో రక్తం గడ్డకట్టే సమస్యకు (సెరెబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ సీవీటీ) సంబంధించిన ప్రమాద కారకాలుగా ఉండవచ్చని బెంగళూరులోని నిమ్హాన్స్ పరిశోధకులు వెల్లడించారు. ఈ సమస్యను సాధారణంగా సిరల సంబంధిత పక్షవాతంగా పరిగణిస్తారు. ముఖ్యంగా ప్రోటీన్, ఫోలేట్, విటమిన్ బి12 లోపాలు, రక్తంలో హోమోసిస్టీన్ స్థాయులు పెరగడం ఈ వ్యాధితో సంబంధం కలిగి ఉన్నట్లు అధ్యయనంలో గుర్తించారు. కర్ణాటకతో పాటు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్యపై పరిశోధకులు అధ్యయనం చేశారు.
104 మంది రోగులు.. 109 మందితో పోలిక
నిమ్హాన్స్ న్యూరాలజీ విభాగం పరిశోధకులు 2020 నుంచి 2022 వరకు సీవీటీ సమస్యతో ఆస్పత్రిలో చేరిన 104 మంది రోగుల వివరాలను విశ్లేషించారు. వీరితో పాటు 109 మంది ఆరోగ్యవంతులతో పోల్చి చూశారు. రోగుల రక్త పరీక్షలు, ఆరోగ్య పరిస్థితులు, ఆహారపు అలవాట్లను పరిశీలించారు. ఆహారంలో లభించే ప్రోటీన్, ఫోలేట్, విటమిన్ బి12 తదితర పోషకాల పరిమాణాన్ని సిఫార్సు చేసిన రోజువారీ అవసరాలతో పోల్చారు.
ఈ అధ్యయనంలో సీవీటీ బాధితుల్లో 63.5 శాతం మందికి హోమోసిస్టీన్ స్థాయులు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. 46.2 శాతం మందిలో రక్తహీనత, 45.2 శాతం మందిలో మద్యపానం అలవాటు, 37.5 శాతం మందిలో ఫోలేట్ లోపం, 26 శాతం మందిలో విటమిన్ బి12 లోపం ఉన్నట్లు వెల్లడైంది.
మద్యపానంతో పోషకాల లోపాలు
మద్యం సేవించే వారిలో హోమోసిస్టీన్ స్థాయులు ఎక్కువగా, ఫోలేట్ స్థాయులు తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అధికంగా మద్యం తీసుకోవడం వల్ల సరైన ఆహారం తీసుకోకపోవడం, పోషకాలు శరీరంలోకి శోషించుకునే ప్రక్రియ దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తవచ్చని అధ్యయనం వివరించింది. దీనివల్ల ఫోలేట్, విటమిన్ బి12 లోపాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
అధ్యయనంలో మద్యం సేవించిన వారిలో 79 శాతం మంది అధికంగా మద్యం తీసుకునే అలవాటు ఉన్నవారిగా గుర్తించారు. మొత్తం అధ్యయనంలో పాల్గొన్న వారిలో 35.6 శాతం మంది అధిక మద్యపానం చేసే వారని పరిశోధకులు తెలిపారు. అయితే మద్యపానం నేరుగా సీవీటీకి కారణమవుతుందని ఈ పరిశోధన నిరూపించలేదు. ఈ రెండింటి మధ్య సంబంధాన్ని మాత్రమే గుర్తించింది.
ప్రోటీన్, ఫోలేట్ లోపం కూడా కీలకం
ఆరోగ్యవంతులతో పోల్చినప్పుడు సీవీటీ రోగుల్లో ప్రోటీన్, ఫోలేట్ తక్కువగా ఉండే ఆహారం తీసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు విశ్లేషణలో తేలింది. ప్రోటీన్ లోపం ఉన్న ఆహారం తీసుకునే అవకాశాలు సుమారు 21 రెట్లు, ఫోలేట్ లోపం ఉన్న ఆహారం తీసుకునే అవకాశాలు 3.4 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.
రోగుల్లో ఎక్కువ మంది తక్కువ ఆదాయ, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారని అధ్యయనం తెలిపింది. మాంసాహారం తీసుకునే వారిలోనూ దాని వినియోగం పరిమితంగా ఉండటం పోషకాహార లోపాలకు ఒక కారణం కావచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.












