స్థానిక ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల, రాంనగర్ లో ప్రపంచ సికిల్ సెల్ వ్యాధి దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సికిల్ సెల్ అనీమియా వ్యాధి లక్షణాలు, కారణాలు, మరియు నివారణ చర్యలపై నిపుణులు వివరించారు.
కార్యక్రమ నిర్వాహకుడు డాక్టర్ రాకేష్ మాట్లాడుతూ, సికిల్ సెల్ అనీమియా అనేది ఎర్ర రక్త కణాలు (RBCs) కొడవలి ఆకారంలో మారడం వల్ల కలిగే జన్యుపరమైన వ్యాధి అని తెలిపారు. ఈ కారణంగా శరీరానికి ఆక్సిజన్ సరఫరా తగ్గి తీవ్రమైన నొప్పి, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయని ఆయన వివరించారు.
సాధారణంగా గుండ్రంగా ఉండే ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలో మారి రక్తనాళాల్లో ఇరుక్కుపోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గి, అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని డాక్టర్ రాకేష్ పేర్కొన్నారు. ఈ వ్యాధి ఆదివాసీ గిరిజనులలో ఎక్కువగా కనిపిస్తుందని ఆయన తెలిపారు.
వ్యాధిపై విస్తృత అవగాహన కల్పించడం ద్వారా బాధితులను సకాలంలో గుర్తించి, వారికి తగిన చికిత్స అందించాలని ఆయన సూచించారు. అవగాహన కార్యక్రమాలు ఇలాంటి వ్యాధుల నిర్మూలనకు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ అజయ్, DPC విమల, పవన్, విజయ, రమణ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. వ్యాధి నిర్ధారణ, చికిత్సపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.











