సముద్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, సముద్ర ఉష్ణ తరంగాలు, చేపల వలసలు, పగడపు దిబ్బల విధ్వంసం వంటి పరిణామాలు సముద్ర జీవావరణ వ్యవస్థకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయి. వీటి ప్రభావం మత్స్య సంపదతో పాటు తీర ప్రాంత ప్రజల జీవనోపాధిపైనా పడుతోంది. ఈ నేపథ్యంలో సముద్రాలను నిరంతరం పర్యవేక్షించేందుకు సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ సముద్ర శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
కేరళలోని కొచ్చిలో నిర్వహించిన అంతర్జాతీయ ట్రెవర్ సఫారీ ( ) సదస్సులో శాస్త్రవేత్తలు ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ఐసీఏఆర్ పరిధిలోని కేంద్ర సముద్ర మత్స్య పరిశోధనా సంస్థ (సీఎంఎఫ్ఆర్ఐ) నిర్వహిస్తోంది. 30 దేశాలకు చెందిన 300 మందికి పైగా మత్స్య పరిశోధకులు, వాతావరణ నిపుణులు, సముద్ర శాస్త్రవేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమన్వయం చేయాలి
సముద్ర పరిస్థితులను కచ్చితంగా అంచనా వేయడానికి ఉపగ్రహ చిత్రాలు, సముద్ర పరిశీలనా కేంద్రాల సమాచారం, వాతావరణ నమూనాలు, కృత్రిమ మేధస్సు, సముద్రంలో ప్రత్యక్షంగా సేకరించే సమాచారాన్ని సమన్వయం చేయాలని నిపుణులు సూచించారు. వీటిని సమన్వయం చేసి విశ్లేషించడం ద్వారా సముద్ర ఉష్ణ తరంగాలు, హానికరమైన ఆల్గే వ్యాప్తి, చేపలు అధికంగా లభించే ప్రాంతాలను ముందుగానే గుర్తించవచ్చని తెలిపారు.
సముద్ర పరిస్థితుల్లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గుర్తిస్తే మత్స్యకారులకు వాతావరణం, అలల తీవ్రత, సముద్ర ప్రవాహాలపై ముందస్తు హెచ్చరికలు అందించవచ్చని పేర్కొన్నారు. తద్వారా సముద్రంలో ప్రమాదాలను తగ్గించడంతో పాటు మత్స్య సంపదను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని వివరించారు.
వాతావరణ మార్పులతో సముద్ర జీవులకు ముప్పు
గత కొన్ని దశాబ్దాలుగా తుఫానులు, కరువులు, కార్చిచ్చులు, ఉష్ణ తరంగాలు వంటి తీవ్ర వాతావరణ పరిణామాలు పెరుగుతున్నాయని గ్రీకు శాస్త్రవేత్త జాన్ ఏ. గిట్టింగ్స్ తెలిపారు. వీటి ప్రభావంతో సముద్ర జీవుల శారీరక పరిస్థితులు, సంఖ్య, నివాస ప్రాంతాలు, జీవన విధానాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని వివరించారు. సముద్ర ఉత్పాదకతలోనూ అసాధారణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. అందుకే నిరంతర సముద్ర పర్యవేక్షణ అవసరమని ఆయన స్పష్టం చేశారు.
భారత ఉపగ్రహాలతో చేపల లభ్యత అంచనా
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పరిధిలోని సముద్ర పరిశీలనా ఉపగ్రహాలు సముద్ర పర్యవేక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎన్. అపర్ణ తెలిపారు. భారత ఉపగ్రహ చిత్రాల ద్వారా ఎల్ నినో ప్రభావం, ఆల్గే వ్యాప్తి, సముద్ర ఉత్పాదకతను పరిశీలించగలుగుతున్నట్లు ఆమె వివరించారు.
భారతదేశానికి చెందిన ఓషన్సాట్-3 ఉపగ్రహంలోని ఓషన్ కలర్ మానిటర్-3 పరికరం ద్వారా చేపలు అధికంగా లభించే ప్రాంతాలను గుర్తిస్తున్నారు. ఈ సమాచారంతో మత్స్యకారులకు ముందస్తు సూచనలు అందిస్తున్నారు. ఈ సూచనలను అనుసరించి చేపల వేటకు వెళ్లిన వారికి ఇతర ప్రాంతాలతో పోలిస్తే 1.5 నుంచి 4 రెట్లు అధికంగా చేపలు లభిస్తున్నట్లు పరిశోధనల్లో వెల్లడైందని ఆమె తెలిపారు.












