మంచిర్యాల పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు దూకుడు పెంచారు. రాష్ట్ర డీజీపీ సమీక్ష అనంతరం పాత నేరస్తులపై నిఘా, పెండింగ్ కేసుల పరిష్కారం, బైండోవర్ ప్రక్రియను వేగవంతం చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు.
ఇటీవల పాత మంచిర్యాలలో చోటుచేసుకున్న దాడి, విధ్వంసం ఘటన నేపథ్యంలో పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పెంట రవి, రగీశెట్టి రాజులను కోర్టులో హాజరుపరచగా జైలుకు తరలించారు. మిగిలిన ఆరుగురికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. గతంలో ఎర్రగుంట సంపత్, సంజీవ్‌లపై ఏడాది పాటు నగర బహిష్కరణ ఆదేశాలు అమలయ్యాయి.
మంచిర్యాల బైపాస్ రోడ్డుతో పాటు ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు, నైట్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, పాత నేరస్తుల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సీపీ స్వయంగా రాత్రివేళల్లో పర్యవేక్షణ చేపడుతుండగా, డీసీపీ, ఏసీపీలు క్షేత్రస్థాయిలో తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నారు.
పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీస్ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.












