డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండలం తాటిపాకలో ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైన ముగ్గురు చిన్నారులను పోలీసులు సుమారు రెండు గంటల్లోనే గుర్తించి, సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
తాటిపాకలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెంటనే స్పందించి, చిన్నారుల ఆచూకీ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.
డీఎస్పీ పర్యవేక్షణలో పోలీసులు ప్రత్యేక బృందాలతో పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. సీఐ సురేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం, ముగ్గురు చిన్నారుల్లో పెద్దవాడైన బాలుడు సరదాగా మిగిలిన ఇద్దరినీ వెంట తీసుకుని తాటిపాక నుంచి ములికిపల్లి వైపు వెళ్లాడు.
మార్గమధ్యంలో బైక్‌పై లిఫ్ట్ అడిగి అక్కడికి చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ములికిపల్లిలో అయోమయంగా ఓ బల్ల వద్ద కూర్చున్న చిన్నారులను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని, ముగ్గురు చిన్నారులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం వారిని బుజ్జగించి, కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లలు క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వేగంగా స్పందించి చిన్నారులను గుర్తించిన పోలీసులను స్థానికులు అభినందించారు.












