ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన గవర్నర్‌గా డాక్టర్ ధాల్ సింగ్ బిసేన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. డెహ్రాడూన్‌లోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఉత్తరాఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మనోజ్ కుమార్ తివారీ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ధాల్ సింగ్ బిసేన్ ఉత్తరాఖండ్ తొమ్మిదో గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అభినందనలు తెలిపారు. బిసేన్‌కు సుదీర్ఘ రాజకీయ, పరిపాలనా అనుభవం ఉందని, ఆయన అనుభవం రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాసేవ పట్ల నిబద్ధత, రాజ్యాంగ విలువల పరిరక్షణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య సంప్రదాయాలను బలోపేతం చేయడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఆయన విజయవంతమైన పదవీకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.
అభివృద్ధికి ప్రాధాన్యం
ప్రమాణ స్వీకారం అనంతరం ధాల్ సింగ్ బిసేన్ మాట్లాడుతూ, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించిన జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాఖండ్ ఆధ్యాత్మిక విశ్వాసాలకు, సంస్కృతికి కేంద్రంగా ఉండటంతో పాటు దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న సైనికుల రాష్ట్రంగా కూడా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. గవర్నర్‌గా రాజ్యాంగ విలువలను కాపాడటం, పదవి గౌరవాన్ని నిలబెట్టడం తన ప్రధాన బాధ్యతలని బిసేన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలతో కలిసి విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యాటకం, పర్యావరణ పరిరక్షణ, ఉపాధి, ప్రజా సంక్షేమ రంగాల్లో అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారు. రాష్ట్రంలో శాంతి, భద్రత, సమృద్ధి సాధించడమే లక్ష్యమని వివరించారు.
బిసేన్ రాజకీయ అనుభవం
ధాల్ సింగ్ బిసేన్ మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తూ పాఠశాల విద్య, అటవీ, రవాణా, గనుల శాఖలకు సంబంధించిన బాధ్యతలు నిర్వహించారు. 2011 నుంచి 2013 వరకు మధ్యప్రదేశ్ నాలుగో రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా వ్యవహరించారు. అనంతరం బాలాఘాట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికై 2024 వరకు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించారు. న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను ఉత్తరాఖండ్ గవర్నర్‌గా నియమించారు. తాజాగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఐదేళ్లకు పైగా గవర్నర్‌గా పనిచేసిన లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్ స్థానంలో బిసేన్ బాధ్యతలు స్వీకరించారు.












