అందోల్, 2026-08-19
సంగారెడ్డి జిల్లా అందోల్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఆరోగ్యం, భద్రత, సాధికారతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రుతుక్రమ పరిశుభ్రత, పోషకాహారం, సైబర్ నేరాలపై వివరించారు.
మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావోబేటీ పడావో కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా అందోల్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు రుతుక్రమ పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, ఆరోగ్యం, భద్రత, సాధికారతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బాలికలకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి ప్రతిభను ప్రోత్సహించి, స్వయం సాధికారత సాధించేలా చేయడం సమాజం బాధ్యత అన్నారు. చిన్న వయస్సు నుంచే స్పష్టమైన కెరీర్ లక్ష్యాలను ఏర్పరచుకుని, క్రమశిక్షణ, సమయపాలన, నిరంతర కృషితో వాటిని సాధించాలని సూచించారు.
బాలికల భద్రతపై అవగాహన కల్పిస్తూ సేఫ్ టచ్అన్సేఫ్ టచ్, వ్యక్తిగత హద్దులు, సైబర్ నేరాలు, ఆన్లైన్ భద్రతపై వివరించారు. అపరిచితులతో వ్యక్తిగత వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలు, ఫోటోలు పంచుకోవద్దని సూచించారు.
సమతుల్య పోషకాహారం తీసుకోవడం, ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకుని రక్తహీనతను నివారించుకోవాలని తెలిపారు.
అనంతరం శానిటరీ ప్యాడ్ బ్యాంకు ద్వారా విద్యార్థినులకు 3,000 శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసి, వాటి వినియోగం, పారవేత విధానంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు), సీడీపీఓ మాధులిక, ఎంఆర్వో మధుకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, ఎంఈఓ కృష్ణ, ఎస్ఓ జ్యోతి, ఇన్చార్జి ఎస్ఓ సుకన్య, మెడికల్ ఆఫీసర్ శంకర్, జిల్లా సమన్వయకర్త పల్లవి, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎస్ఐ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, జెండర్ స్పెషలిస్ట్, విద్యార్థినులు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.












