సంగారెడ్డి జిల్లా మండలం పెద్దలోడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయట నుంచి తెచ్చిన చికెన్ బిర్యానీని విద్యార్థులకు అందించడంతో 34 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టి, బాధ్యుడైన సోషల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడు ఎ.వెంకటేశంను సస్పెండ్ చేశారు.
జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి తెలిపిన వివరాల ప్రకారం, పాఠశాలలో విద్యార్థులకు బయట నుంచి తెచ్చిన ఆహారాన్ని అందించే విషయంలో నిబంధనలు పాటించాల్సి ఉంది. అయినప్పటికీ, సంబంధిత ఉపాధ్యాయుడు చికెన్ బిర్యానీని విద్యార్థులకు అందించారు. ఈ క్రమంలో మొత్తం 34 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై స్థానిక వైద్యులను సంప్రదించి వారికి వైద్య సహాయం అందించారు. ప్రస్తుతం విద్యార్థులందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేదని డీఈఓ రోహిణి స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలడంతో ఉపాధ్యాయుడు ఎ.వెంకటేశంపై సస్పెన్షన్ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.










