నశాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై యువతకు, విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. పట్టణంలోని లైన్స్ భవన్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నశాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాలపై యువతకు, ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పట్టణంలోని సున్నం బట్టి వాడలో గల లైన్స్ భవన్ ప్రాంగణంలో ఒక సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివేకవర్ధిని డిగ్రీ కాలేజ్, సివి రామన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థినీ విద్యార్థులు దాదాపు 200 మంది పాల్గొన్నారు.
ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా పట్టణ ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ సునీల్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు, మాదకద్రవ్యాలకు యువత, ముఖ్యంగా విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. వ్యసనానికి బానిస అయితే ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి తలెత్తుతుందని తెలిపారు.
ఎవరైనా ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారికి ప్రభుత్వపరంగా ఉచిత వైద్యం, కౌన్సిలింగ్ అందించి, ఈ వ్యాధిని తగ్గించే అవకాశం ఉందని వివరించారు. ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వారు తమను సంప్రదించవచ్చని విజ్ఞప్తి చేస్తూ, వ్యాధి సోకితే ఎదుర్కొనే సమస్యలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలు అందజేశారు.
జిల్లా ఆరోగ్య వైద్యాధికారి వెంకటేశ్వర్లు మాదకద్రవ్యాలపై గీతాల ద్వారా విద్యార్థులకు చైతన్యం కల్పించారు. చివరగా, విద్యార్థులచే మాదకద్రవ్యాల నిర్మూలనకు, వికసిత భారత్ లక్ష్యంగా ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, రెడ్ క్రాస్ ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాలలో, ముఖ్యంగా విద్యా సంస్థలతోపాటు ప్రజలకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.












