హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ను సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని వివిధ విభాగాలను ఆమె పరిశీలించి, కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు.
డీసీపీ దారా కవితకు ఎల్కతుర్తి సీఐ పులి రమేష్, ఎస్ఐ నరసింహారావు మరియు పోలీస్ సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్లోని ఫైళ్లు, రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలను ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా డీసీపీ దారా కవిత మాట్లాడుతూ, పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, మండల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి, నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీస్ స్టేషన్లో ఫైళ్లు, రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు. డీసీపీ తనిఖీతో పోలీస్ సిబ్బందికి మరింత ఉత్సాహం కలిగిందని అధికారులు తెలిపారు.












