రోడ్డు ప్రమాదంలో మరణించిన సింగరేణి ఒప్పంద (కాంట్రాక్ట్) డ్రైవర్ కంబాల రాజేష్ కుటుంబానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ద్వారా మంజూరైన రూ.50 లక్షల ప్రమాద బీమా చెక్కును అధికారులు అందజేశారు.
ఎస్టీపీపీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సింగరేణి ఈడి సిహెచ్. చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా జీతాలు పొందే కాంట్రాక్ట్ కార్మికులకు ఈ ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. బ్యాంక్ నిబంధనల ప్రకారం రూ.25,000 లోపు జీతం ఉన్నవారికి రూ.40 లక్షలు, రూ.25,000 దాటిన వారికి రూ.50 లక్షల బీమా అందుతుందని వివరించారు.
గత నవంబర్లో రోడ్డు ప్రమాదంలో మరణించిన డ్రైవర్ రాజేష్, చనిపోవడానికి నెల రోజుల ముందే పీఎన్బీలో ఖాతా తెరిచారని, ఆయనకు రూ.50 లక్షల బీమా మంజూరైందని అధికారులు తెలిపారు. రాజేష్ అకాల మరణంతో దిక్కుతోచని స్థితిలో పడిన ఆయన భార్య, ఇద్దరు చిన్న పిల్లలకు ఈ బీమా డబ్బు కొండంత ఆర్థిక ఆసరాగా నిలుస్తుందని ఈడి చిరంజీవి పేర్కొన్నారు.
కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం కోసం పీఎన్బీ మేనేజర్ కృషి చేసి, ఇప్పటివరకు దాదాపు 1500 మందితో బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించడాన్ని అధికారులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో జీఎం మదన్మోహన్, ఏజీఎం సూర్యనారాయణ రాజు, పిఎన్బి ఏజీఎం ఖాలిద్ ఇస్మాయిల్, మేనేజర్ అమరేశ్, కార్మిక సంఘాల నాయకులు సత్యనారాయణ, డి. పంతుల, డీజీఎం కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.












