రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించే లక్ష్యంతో మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ హాజీపూర్ మండలంలోని ఎరువుల దుకాణాల్లో సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. వ్యవసాయ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ, వ్యవసాయ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా హాజీపూర్ మండలంలోని ఎరువుల దుకాణాల్లో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నాణ్యతపై సమగ్ర తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా, విత్తనాల స్టాక్, బిల్లులు, లాట్ నంబర్లు, ధరల పట్టికలు, లైసెన్స్ వివరాలను అధికారులు పరిశీలించారు.
నాణ్యత లేని, గడువు ముగిసిన, నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు దుకాణదారులను హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటం ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా వ్యాపారాలు నిర్వహించాలని సూచించారు.
ప్రభుత్వం సిఫార్సు చేసిన వరి సన్న రకాలైన BPT 5294, తెలంగాణ సోనా RNR 15048, KNM 1638, Jai Shree Ram, HMT, WGL 962, WGL 44, JGL 1798 వంటి విత్తనాలను మాత్రమే విక్రయించాలని, దొడ్డు రకాల విత్తనాలను అమ్మరాదని స్పష్టం చేశారు.
ఈ తనిఖీల్లో మంచిర్యాల ADA కృష్ణ, హాజీపూర్ తహసీల్దార్ పుష్పలత, AO కృష్ణ, పోలీసు అధికారి తిరుపతి పాల్గొన్నారు. PACS పద్తనపల్లి, కొమురెల్లి మల్లికార్జున ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి, అవసరమైన సూచనలు చేశారు.












