ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో సురక్షిత మాతృత్వంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత, వైద్యులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, సురక్షిత మాతృత్వంపై ప్రజలలో అవగాహన కల్పించడానికి కరపత్రాలు విడుదల చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 4485 ప్రసవాలు జరిగాయని, ఇందులో 1870 సాధారణ ప్రసవాలని, అధిక ప్రమాదం ఉన్న గర్భిణీలకు కూడా ఇక్కడే చికిత్స అందించినట్లు పేర్కొన్నారు.
ప్రైవేటు ఆసుపత్రులు సాధారణ ప్రసవాలపై దృష్టి సారించాలని, 'సాధారణ ప్రసవాలు ముద్దు, సిజేరియన్లు వద్దు' అనే నినాదంతో అవగాహన కల్పించాలని ఆదేశించారు. అధిక ప్రమాదం ఉన్న గర్భాలను సకాలంలో గుర్తించి, వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
చిన్న వయసులో గర్భం, అధిక బరువు, రక్తహీనత, దీర్ఘకాలిక వ్యాధులు వంటి అధిక ప్రమాదం గల గర్భాలను గుర్తించి, సూపర్ స్పెషాలిటీ వైద్యులచే చికిత్స అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి గర్భిణీ నాలుగు సార్లు వైద్య పరీక్షలు చేయించుకోవాలని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.
ఆసుపత్రి ప్రసవాల ప్రాముఖ్యత, 108, 102 అంబులెన్స్ సేవల వినియోగం, తల్లిపాల ప్రాధాన్యత, కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన పొందాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.












