మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మించిన మహాప్రస్థానం స్మశాన వాటిక సందర్శన కోసం వచ్చిన డిప్యూటీ సీఎం, మంత్రుల షెడ్యూల్ లో పలుమార్లు మార్పులు చోటుచేసుకున్నాయి. అనివార్య కారణాల వల్ల ఈ సందర్శన వాయిదా పడింది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి రోడ్డులో ఏర్పాటు చేసిన మహాప్రస్థానం స్మశాన వాటికను సందర్శించేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అట్లూరి లక్ష్మణ్ కుమార్ ల పర్యటన ముందుగా శుక్రవారం (13వ తేదీ) సాయంత్రం జరగాల్సి ఉంది.
అయితే, అనివార్య కారణాల వల్ల ఈ పర్యటన వాయిదా పడింది. అనంతరం, శనివారం (14వ తేదీ) ఉదయం 9 గంటలకు డిప్యూటీ సీఎం, ఐటీ మంత్రి సందర్శిస్తారని షెడ్యూల్ లో చేర్చారు. ఈ పర్యటన సింగరేణి ఓపెన్ కాస్ట్ (OC) పరిశీలన అనంతరం ఉంటుందని భావించారు.
అయితే, ఈ రెండో షెడ్యూల్ కూడా రద్దయింది. పద్మావతి ఫంక్షన్ హాల్ లో జరిగిన సర్వసభ్య సమావేశం అనంతరం మంత్రులు నేరుగా హైదరాబాద్ కు వెళ్లిపోయారు. దీంతో, ఎమ్మెల్యే పి.ఎస్.ఆర్. ఆకాంక్షించిన మహాప్రస్థానం సందర్శన జరగకుండానే మంత్రుల పర్యటన ముగిసిపోయింది.
ఈ పరిణామంపై ఎమ్మెల్యే పి.ఎస్.ఆర్. కొంత నిరాశ చెందినట్లు సమాచారం. మంత్రుల పర్యటన మూడు సార్లు వాయిదా పడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్శన ఎప్పుడు జరుగుతుందనే దానిపై స్పష్టత లేదు.










