నర్సాపూర్, 11 September
పర్యావరణ పరిరక్షణలో భాగంగా రసాయన రహిత, పర్యావరణహిత మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని నాగులపల్లి ఉన్నత పాఠశాల హెచ్ఎం, గ్రీన్ టీచర్ డి. ప్రసన్న కుమార్ సూచించారు. మండలం నాగులపల్లి ఉన్నత పాఠశాలలో ఎన్జీసీ ఎకో క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులపై అవగాహన, ప్రతిమల తయారీ కార్యక్రమం జరిగింది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ రసాయన రహిత, పర్యావరణహిత మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని నాగులపల్లి ఉన్నత పాఠశాల హెచ్ఎం, గ్రీన్ టీచర్ డి.ప్రసన్న కుమార్ సూచించారు. మండలం నాగులపల్లి ఉన్నత పాఠశాలలో నేషనల్ గ్రీన్ కార్ప్స్ (ఎన్జీసీ) ఎకో క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులపై అవగాహన కార్యక్రమంతో పాటు ప్రతిమల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన వినాయక ప్రతిమలు, రసాయనిక రంగుల వినియోగం వల్ల పర్యావరణం, నీటి వనరులు కలుషితమవుతున్నాయని విద్యార్థులకు వివరించారు. పండుగలను పర్యావరణానికి హాని కలిగించకుండా, ప్రకృతి వనరులను కాపాడే విధంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని ప్రసన్న కుమార్ సూచించారు. ప్రతి సంవత్సరం నేషనల్ గ్రీన్ కార్ప్స్, పాఠశాల ఎన్జీసీ ఎకో క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసిన విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేశారు. విద్యార్థులు తాము తయారు చేసిన మట్టి వినాయకులను ఇళ్లలో పూజించి పర్యావరణహితంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అరుణ, రాజు, వెంకటరమణ, స్వర్ణలత, శారద, అనంతరామ్ గౌడ్‌తో పాటు ఎన్జీసీ ఎకో క్లబ్ విద్యార్థులు పాల్గొన్నారు.












