సంగారెడ్డి, 2026-11-26
దేశ రక్షణ కోసం సేవలందించిన సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత న్యాయ సేవలు అందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నాల్సా వీర్ పరివార్ సహాయతా యోజన పథకంపై ఈ కార్యక్రమం జరిగింది.
దేశ రక్షణ కోసం విశేష సేవలందించిన సైనికులు, పదవీ విరమణ పొందిన సైనికులు, వారి కుటుంబ సభ్యులకు న్యాయపరమైన హక్కులు, ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని కాన్ఫరెన్స్ హాల్ లో నాల్సా వీర్ పరివార్ సహాయతా యోజన పథకంపై ఈ అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య హాజరై పథకం ముఖ్య ఉద్దేశాలు, లక్ష్యాలు, ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ సేవలో జీవితాలను అంకితం చేసిన సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం, న్యాయ సలహాలు, ఇతర న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, పెన్షన్ సమస్యలు తదితర అంశాల్లో చట్టపరమైన హక్కులు, న్యాయ పరిష్కార మార్గాలపై అవగాహన కల్పించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ దినేష్ కుమార్, పదవీ విరమణ పొందిన సైనిక అధికారులు, సైనిక సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.






