సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల పెగడపల్లి గ్రామ ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే గ్రామాన్ని పునరావాస ప్రాంతానికి తరలించాలని స్థానిక ప్రతినిధులు తెలంగాణ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామిని కోరారు.
మంగళవారం జైపూర్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రిక్కుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పెగడపల్లి ప్రతినిధుల బృందం మంత్రిని కలిసి, ప్లాంట్ నుంచి వెలువడే ధూళి, ఫ్లై యాష్ వల్ల గాలి కాలుష్యం పెరిగి శ్వాసకోశ, చర్మ వ్యాధులు అధికమవుతున్నాయని వివరించింది.
పంటలు దెబ్బతినడం, తాగునీరు కలుషితం కావడం వంటి సమస్యలతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని, ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సింగరేణి యాజమాన్యం గ్రామాన్ని స్వాధీనం చేసుకుని, మౌలిక వసతులతో కూడిన పునరావాస కాలనీ ఏర్పాటు చేసి గ్రామస్తులను తరలించాలని డిమాండ్ చేశారు. మంత్రి సమస్యపై సానుకూలంగా స్పందించి, అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు.








